రాజకీయ లబ్ధి కోసమే సీపీఐ ఆరోపణలు
ఆటో నగర్ అభివృద్ధిలో నాదే కీలక పాత్ర
న్యాయబద్ధంగానే దశాబ్దాలుగా వ్యాపారాలు
చిన్న కాలువ కోసం కక్కుర్తి పడను
సీపీఐ నేతల ఆరోపణలపై శ్రీ సిటీ వెంకట్రావు స్పందన
కాకతీయ, ఖమ్మం రూరల్: తనపై సీపీఐ నాయకులు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని శ్రీ సిటీ వెంకట్రావు స్పష్టం చేశారు. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డులో ఆటో నగర్ అభివృద్ధి చెందడానికి తానే మూల కారకుడినని ఆయన పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని, ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు లేకుండా సురక్షితమైన ప్లాట్లను వేల మంది కస్టమర్లకు అందించానని తెలిపారు. తన వ్యాపార ప్రస్థానంలో ఎక్కడా ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, నిజాయితీతోనే వ్యవహరిస్తున్నానని వెంకట్రావు వెల్లడించారు. తాజా ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, సీపీఐ నాయకులు వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వందల ఎకరాల్లో వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్న తాను, కేవలం ఒక చిన్న కాలువ కోసం కక్కుర్తి పడతానా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని తనపై ఆరోపణలు చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

