- నర్సంపేట మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో డీజిల్ సంక్షోభం!
- జనరేటర్ నిలిచిపోవడంతో నిలిచిన వైద్య సేవలు
- అత్యవసర వైద్యానికి ప్రైవేట్, ఎంజీఎం ఆస్పత్రులకు తరలింపు
- అంబులెన్సులు సైతం కదలని దుస్థితి ఉందంటూ ప్రచారం
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో డీజిల్ మరియు అత్యవసర మందుల కొరత కారణంగా వైద్య సేవలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, సందేశాలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. గర్భిణీలు, చిన్నారులకు సేవలు అందించే ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో డీజిల్ లేక జనరేటర్లు నిలిచిపోతుండగా, కరెంటు అంతరాయం ఏర్పడితే ఓపీ సేవలు మరియు పీడియాట్రిక్ విభాగం పనితీరు తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో జనరేటర్ పనిచేయకపోవడంతో అత్యవసర శస్త్రచికిత్సలు కూడా వాయిదా పడుతున్నాయని పేర్కొంటున్నారు. అలాగే పాంటాప్, ఏవిల్ వంటి అత్యవసర మందులు అందుబాటులో లేక రోగులను ప్రైవేట్ ఆస్పత్రులు మరియు వరంగల్ ఎంజీఎంకు పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా, ఆస్పత్రి పరిధిలోని అంబులెన్సులు సైతం డీజిల్ లేక నిలిచిపోయాయనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. డీజిల్ కోసం ప్రత్యేక బడ్జెట్ లేదని, గత బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదని సిబ్బంది చెబుతున్నట్లు ఆ పోస్టుల్లో ప్రస్తావిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ ఆరోపణలపై ఆస్పత్రి యాజమాన్యం లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనేదానిపై అధికారులు స్పష్టతనిచ్చి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని స్థానికులు మరియు రోగుల బంధువులు కోరుతున్నారు.

