రాష్ట్రంలో పవర్‌కట్ అనేదే లేదు
విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ఉన్నాం
ఎల్‌నినో సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కొంటున్నాం
53 లక్షల ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా
రూ.1.20 కోట్ల ప్రమాద బీమాతో విద్యుత్ ఉద్యోగులకు భరోసా
1912కు ఏఐ సేవలు.. దేశంలోనే తొలి ‘ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్’ తెలంగాణలో
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హన్మకొండలో విద్యుత్ శాఖకు సంబంధించిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర విద్యుత్ డిమాండ్‌ను కూడా తెలంగాణ విద్యుత్ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు విద్యుత్ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వాజ్‌పేయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, హనుమకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనం, టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో నిర్మించిన కొత్త 33/11 కేవీ ఉపకేంద్రం, అత్యాధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో పవర్‌కట్ లేదన్న భట్టి..
సమీక్ష సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో పవర్‌కట్ అనే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు లేదా లైన్లు దెబ్బతిన్నప్పుడు మాత్రమే తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని, దానిని పవర్‌కట్‌గా భావించవద్దన్నారు. సాధారణంగా వర్షాకాలంలో 11 వేల మెగావాట్లుగా ఉండే పీక్ డిమాండ్ ఈసారి 16,500 మెగావాట్లకు చేరినా, మరోవైపు 2 వేల మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినా విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా అధికారులు సమర్థంగా వ్యవహరించారని ప్రశంసించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడం, జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఒకేసారి సుమారు 7 వేల మెగావాట్ల అదనపు భారం ఏర్పడినా, ముందస్తు ప్రణాళికలతో ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించామని తెలిపారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలతో పాటు వ్యవసాయ బోర్‌వెల్ల వినియోగం పెరగడం వల్ల ఏర్పడిన అదనపు అవసరాలను కూడా విజయవంతంగా నిర్వహించామన్నారు.
ప్రజాబాట.. పొలంబాటతో సమస్యల పరిష్కారం..
ప్రజాబాట, పొలంబాట కార్యక్రమాల ద్వారా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారని భట్టి తెలిపారు. త్వరలో దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే కృత్రిమ మేధ (ఏ ఐ ) సాంకేతికత ద్వారా సమాచారం సంబంధిత బృందానికి చేరి, అత్యవసర సేవలు వేగంగా అందుతాయని వివరించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నామని భట్టి తెలిపారు. లైన్‌మెన్ల భద్రత కోసం ఆధునిక సేఫ్టీ కిట్లు, యూనిఫారాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లులను ఆర్థిక శాఖ డిస్కంలకు చెల్లిస్తోందని, 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఏటా సుమారు రూ.14 వేల కోట్ల సబ్సిడీ కూడా ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో కీలక వివరాలు..
ఈ సందర్భంగా టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సంస్థ పనితీరుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు 70 కొత్త 33/11 కేవీ ఉపకేంద్రాలు, 31,448 కిలోమీటర్ల కొత్త విద్యుత్ లైన్లు, 35,736 డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7.72 లక్షల కొత్త ఎల్‌టీ, 771 హెచ్‌టీ కనెక్షన్లు మంజూరు చేసి, 1,656 గ్రామాలు, 11.16 లక్షల మందికి పైగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరిందన్నారు. రాష్ట్రంలో నమోదైన 18,548 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా నిర్వహించామని, మాన్సూన్‌లో దెబ్బతిన్న వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. 1912 కాల్‌సెంటర్ ద్వారా రోజుకు సగటున 2 వేల ఫిర్యాదులు స్వీకరించి, 99.74 శాతం సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిజిటల్ సంస్కరణల్లో భాగంగా ఎస్ సి ఏ డి ఏ, ఏఐ చాట్‌బాట్, డ్రోన్ సర్వే, జిఐఎస్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను అమలు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, డీఎఫ్‌వో నిఖిల, టీజీఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

