మార్కెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్ సత్యశారద
పీహెచ్ సీ, చైల్డ్ లేబర్ స్కూల్, పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు, కార్మికులు, వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ డా సత్య శారద తెలిపారు. శుక్రవారం మార్కెట్ ఛైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంకతో కలిసి కలెక్టర్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ లోని వివిధ వసతులను, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ మార్కెట్ కు రోజూ వేలాది మంది రైతులు, హమాలీలు, కార్మికులు వచ్చే నేపథ్యంలో వారి ఆరోగ్యం దృష్ట్యా మార్కెట్ యార్డులో పిహెచ్ సి ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. మార్కెట్ పరిధిలో చైల్డ్ లేబర్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ లో భద్రత కోసం ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా స్థలాన్ని పరిశీలించారు.
ముసలమ్మకుంట మామిడి మార్కెట్ పరిశీలన
ముసలమ్మకుంట మామిడి మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్, మార్కెట్ కు వెళ్లే రోడ్డు నిర్మాణం, రోడ్ లెవెలింగ్ పనులు, రైతుల కోసం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కె సురేఖ, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్ శ్రీనివాస్, ఆర్ డివో సుమలత, ఎంఅర్ వో శ్రీకాంత్, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష బొమ్మినేని రవీందర్ రెడ్డి, కార్యదర్శులు, పండ్ల మార్కెట్ వ్యాపారులు వి సాంబయ్య, చెన్నమల్లు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

