బండమీద బాదుడే
జీసీసీ, హెచ్‌పీ గ్యాస్ పంపిణీలో అదనపు వసూళ్ల
ఏటూరునాగారంలో గ్యాస్ పంపిణీ అక్రమాలు
అధికారిక ధర ఒకటి… వినియోగదారుల నుంచి వసూలు మరోటి
రసీదులు లేకుండా సాగుతున్న నగదు, యూపీఐ లావాదేవీలు
ఏటూరునాగారంలో రోజుకు వేలల్లో, నెలకు లక్షల్లో గుంజుతున్న సిబ్బంది
డ్రైవింగ్ లైసెన్సులు లేనివారితోనే వాహనాల నిర్వహణ?
సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ గృహ వినియోగ సిలిండర్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారిక ధర రూ.1,013గా ఉన్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌కు రూ.1,050 వరకు వసూలు చేసినట్లు చెల్లింపు వివరాలు వెలుగులోకి రావడం గ్యాస్ పంపిణీ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎండగడుతోంది. డెలివరీ అనంతరం అధికారిక రసీదులు జారీ కాకపోవడం, వ్యక్తిగత యూపీఐ ఖాతాల ద్వారా చెల్లింపులు జరిగినట్లు కనిపిస్తున్న లావాదేవీలు గ్యాస్ పంపిణీ వ్యవస్థపై అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గతంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా, సిలిండర్ల నిర్వహణలో లోపాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలు, హెచ్‌పీసీఎల్ విధించిన జరిమానాతో వార్తల్లో నిలిచిన ఈ ఏజెన్సీలో ఇప్పుడు గృహ వినియోగ సిలిండర్ల పంపిణీ విధానం కూడా ప్రధాన వివాదంగా మారింది. అధికారిక ధరకు మించి వసూలైనట్లు చెబుతున్న అదనపు మొత్తం ఎవరి ఆదేశాలతో తీసుకుంటున్నారు? ఆ మొత్తానికి సంబంధించిన లెక్కలు ఎక్కడ నమోదవుతున్నాయి? రసీదులు ఎందుకు ఇవ్వడం లేదు? వ్యక్తిగత ఖాతాలకి జరిగిన చెల్లింపుల ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కరువైంది.

లోకల్‌లోనే అదనపు భారం…
జీసీసీ పరిధిలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ప్రస్తుతం మూడు ప్రభుత్వ, ఒక ప్రైవేట్ వాహనం ద్వారా హెచ్‌పీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. గ్యాస్ డెలివరీ మార్గదర్శకాల ప్రకారం స్థానిక పరిధి (లోకల్)లో వినియోగదారుల నుంచి అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ మండల కేంద్రంలోనే ఒక్కో గృహ వినియోగ సిలిండర్‌పై అధికారిక ధరకు అదనంగా సుమారు రూ.37 వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఐదు కిలోమీటర్లకు మించిన ప్రాంతాల్లో డెలివరీ ఛార్జీలు వర్తించినా, నిర్ణయించిన మొత్తానికి మించి ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.57 వరకు అదనంగా తీసుకుంటున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. ఈ అదనపు మొత్తానికి సంబంధించి అధికారిక బిల్లు లేదా రసీదు జారీ కావడం లేదని, నగదు లేదా వ్యక్తిగత యూపీఐ ఖాతాల ద్వారానే చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు లావాదేవీలు స్పష్టంగా సూచిస్తున్నాయి. దీంతో అధికారిక ధరకు మించి వసూలవుతున్న మొత్తం ఏ నిబంధన ప్రకారం తీసుకుంటున్నారు? ఈ నగదు జీసీసీ లేదా ఆయిల్ కంపెనీ అధికారిక లెక్కల్లో నమోదవుతోందా? లేక డెలివరీ ప్రక్రియలోనే పక్కదారి పడుతోందా? అనే ప్రశ్నలు తీవ్రతరం అవుతున్నాయి.


నెలకు లక్షల్లో అదనపు వసూళ్ల దందా
లోకల్‌లో అదనపు మొత్తాల వసూళ్లపై వస్తున్న వివరాల నేపథ్యంలో వాటి పరిమాణంపైనా విస్మయకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. జీసీసీ పరిధిలో గ్యాస్ డెలివరీ నిర్వహిస్తున్న ఒక్కో వాహనానికి రోజుకు సుమారు 40 గృహ వినియోగ సిలిండర్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. అధికారిక ధరకు అదనంగా ఒక్కో సిలిండర్‌పై రూ.37 చొప్పున వసూలు చేస్తున్నారనే వినియోగదారుల సమాచారం ఆధారంగా లెక్కిస్తే, ఒక్కో వాహనం ద్వారా రోజుకు సుమారు రూ.1,480 వరకు అదనపు మొత్తం సేకరించే అవకాశం ఉందని అంచనా. ఇదే విధానం నాలుగు వాహనాలకూ వర్తిస్తే రోజుకు దాదాపు రూ.5,920, నెలకు సుమారు రూ.1.77 లక్షల వరకు చేరే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ అంచనాలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత గానీ, వివరణ గానీ వెలువడకపోవడం గమనార్హం. మరోవైపు, గ్యాస్ డెలివరీ అనంతరం అధికారిక ధర కంటే ఎక్కువ మొత్తాన్ని డెలివరీ సిబ్బంది వ్యక్తిగత యూపీఐ ఖాతాలకు బదిలీ చేసినట్లు చెబుతున్న చెల్లింపు వివరాలు కూడా బయటపడ్డాయి. ఒకవేళ ఈ లెక్కలే వాస్తవమైతే, అదనంగా వసూలైన మొత్తం ఏ ఖాతాలో జమవుతోంది? సంస్థ ఆదాయంలో అది ఎందుకు ప్రతిబింబించడం లేదు? ఆ మొత్తానికి సంబంధించిన అధికారిక రికార్డులు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్
గ్యాస్ డెలివరీ సిబ్బంది అధికారిక ధర మేరకే జీసీసీకి రోజువారీ లెక్కలు సమర్పిస్తున్నట్లు సమాచారం ఉండగా, అదనంగా వసూలైన నగదు లెక్కలు ఎక్కడ నమోదవుతున్నాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. గతంలో గ్యాస్ ఏజెన్సీలో అవకతవకలపై హెచ్‌పీసీఎల్ జరిమానా విధించడం, జీసీసీలో నిధుల దుర్వినియోగం వెలుగుచూడడం, పరిపాలనా లోపాలపై విమర్శలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో తాజా అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో గ్యాస్ డెలివరీ వాహనాలు నడిపే కొందరు డ్రైవర్లకు అవసరమైన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా? అన్న సంచలన సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారిక ధరకు మించి వసూలైనట్లు చెబుతున్న మొత్తం ఏ లెక్కల్లో చూపిస్తున్నారు? రసీదులు ఎందుకు జారీ కావడం లేదు? గ్యాస్ పంపిణీ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతోందా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ఉల్లంఘన లేదా అక్రమ వసూళ్లు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

