- (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమాండ్ల రాజు
- సీనియారిటీ విధివిధానాల సర్క్యులర్ విడుదలపై ఉద్యోగుల్లో హర్షం
- 1,865 మంది ఉద్యోగులకు స్పష్టత వచ్చినట్లు టీజీఆర్ఎస్ఏ వెల్లడి
- జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కృషితో సమస్య పరిష్కారమైందని ప్రశంస
కాకతీయ, వరంగల్ బ్యూరో : జి.ఓ. నంబర్ 81, 85 ప్రకారం జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన 1,865 మంది ఉద్యోగుల సీనియారిటీ ఖరారుకు సంబంధించిన విధివిధానాల సర్క్యులర్ విడుదల కావడంపై తెలంగాణ గ్రామీణ రెవెన్యూ సేవల సంఘం (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమాండ్ల రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్ విడుదలకు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ లచ్చిరెడ్డి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా కొమాండ్ల రాజు మాట్లాడుతూ జి.ఓ. 81, 85 కింద పదోన్నతి పొందిన ఉద్యోగుల సీనియారిటీ అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉండి ఆందోళనకు గురిచేసిందన్నారు. ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో పలుమార్లు చర్చలు జరపడం ద్వారా సీనియారిటీ ఫిక్సేషన్‌కు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాల సర్క్యులర్ విడుదల చేయించడంలో లచ్చిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
సర్క్యులర్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా 1,865 మంది జూనియర్ అసిస్టెంట్ల సీనియారిటీ ఖరారు ప్రక్రియ వేగవంతం కానుందని కొమాండ్ల రాజు పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్ పదోన్నతులు, సేవా ప్రయోజనాలు, వేతన సంబంధిత అంశాల్లో స్పష్టత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఎంప్లాయీ ఐడీలు లేక వేలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిచిపోయిన సందర్భంలో లచ్చిరెడ్డి చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి ఎంప్లాయీ ఐడీలు మంజూరు చేయించడంతో పాటు పెండింగ్ వేతనాలు విడుదలయ్యేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు, ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేసి రెండో ఇంక్రిమెంట్ అందేలా చేస్తున్న కృషి కూడా అభినందనీయమని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సర్వీస్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలో ఉద్యోగ జేఏసీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొమాండ్ల రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇదే విధంగా కృషి కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా టీజీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షుడు ఎడ్ల రవి, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణాకంటి రాజేష్, నాయకుడు కృష్ణప్రసాద్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

