- రూ.249.40 కోట్లతో శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు
- తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు శ్రీకారం
- గుడి చెరువు బండ్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు
- భీమేశ్వర ఆలయంలో వరుణయాగానికి శ్రీకారం
- భక్తులకు మెరుగైన వసతులే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
- రాష్ట్ర సస్యశ్యామలత కోసం ప్రత్యేక ప్రార్థనలు
కాకతీయ, వేములవాడ : ఒకవైపు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మరోవైపు రాష్ట్ర సస్యశ్యామలత కోసం వైదిక క్రతువులు.. ఇలా అభివృద్ధి, ఆధ్యాత్మికత కలగలిసిన విశిష్ట ఘట్టానికి గురువారం దక్షిణకాశి వేములవాడ వేదికైంది.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 10 నుంచి 12 నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్నదాన సత్రం, 80 అడుగుల రహదారి విస్తరణ, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
బస్‌స్టేషన్ ఆధునీకరణ.. కొత్త బస్సుకు ప్రారంభం

తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు రూ.1.62 కోట్లతో మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ–కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, భక్తుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు, మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో అభివృద్ధి చేసిన గుడి చెరువు బండ్ పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. భారీ శివుడి విగ్రహం, నటరాజ స్వామి విగ్రహం, సప్తమాతృకల విగ్రహాలు, ఉద్యానవనాన్ని పరిశీలించారు. ఈ పార్క్ భక్తులు, పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
సస్యశ్యామల తెలంగాణ కోసం వరుణయాగం

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించే సత్వర సద్యఃసువృష్టి వరుణయాగాన్ని ప్రారంభించారు. ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ పర్జన్య జపం, హవనాలు, సంతత ధారాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేములవాడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.వరుణయాగం సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి రైతులకు సాగునీరు పుష్కలంగా అందాలని, తెలంగాణ సస్యశ్యామలంగా విలసిల్లాలని మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

