కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. బి. రాజారెడ్డి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవల పురోగతిపై కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, శాఖాధిపతులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని, ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించిన డా. బి. రాజారెడ్డి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డా. రాజమౌళి, డా. సాజిదా, డా. ఇక్తిదార్ అహ్మద్, డా. అరుణ్ జోషి, డా. అఖిల్, డీఎంఓ రజనీ, సూపరింటెండెంట్ అనిల్ కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, డీపీఎంఓ అనుపమ, డీపీఓ అర్చన, ఫార్మసిస్ట్ సుదర్శన్ గౌడ్, హెచ్ఈఓ సదానందం తదితరులు పాల్గొన్నారు.

