పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 314 మంది చిన్నారులకు విముక్తి
బాల కార్మికులను పనిలో పెట్టిన వారిపై 55 కేసులు
130 మంది ఇతర రాష్ట్రాల చిన్నారుల గుర్తింపు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
కాకతీయ, వరంగల్ బ్యూరో: పిల్లలు బడిలో ఉండాలే తప్ప పనుల్లో కాదని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–పన్నెండో దశలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 314 మంది చిన్నారులను రక్షించినట్లు ఆమె తెలిపారు. వీరిలో 226 మంది బాల కార్మికులు, 85 మంది బడి మానేసిన విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలతో హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
బాల కార్మికులపై ఉక్కుపాదం
రక్షించిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి, కౌన్సెలింగ్ అనంతరం కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 55 కేసులు నమోదు చేయగా, కార్మిక శాఖ 92 తనిఖీ నివేదికలు నమోదు చేసిందన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

