పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కావ్య
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. పెద్ది స్వప్నకు మనోధైర్యం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సంతాపం వ్యక్తం చేశారు. శనివారం నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలిగి ఉండాలని ఓదార్పు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మతో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

