నోటిఫికేషన్ల జాప్యంతో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
సూసైడ్ నోట్‌లో ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయాలని విజ్ఞప్తి
కాకతీయ, ముదిగొండ : ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో జాప్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నిరుద్యోగ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్‌ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు పలుమార్లు హాజరైనా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి, అక్క ఆరోగ్య సమస్యలు తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని అందులో వివరించాడు. తనలాంటి నిరుద్యోగులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి మరోసారి చర్చనీయాంశంగా మారింది.




