తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి
పత్తి రైతులు, జిన్నింగ్ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి
సీసీఐ ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలో అత్యధిక పత్తి కొనుగోళ్లకు ప్రత్యేక అభినందనలు
పత్తి ఉత్పాదకత పెంపునకు పలు ఒప్పందాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : “పత్తి ఉత్పాదకత పెంపు, జిన్నింగ్ పరిశ్రమల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలలో తెలంగాణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి” అని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి కోరారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీరత్న సంస్థ సీసీఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా ఆహ్వానం మేరకు బొమ్మినేని రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సీసీఐ ద్వారా అత్యధిక స్థాయిలో పత్తి కొనుగోళ్లు నిర్వహించినందుకు సీఎండీ లలిత్ కుమార్ గుప్తా వేదికపై రవీందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పత్తి రైతులకు, జిన్నింగ్–ప్రెస్సింగ్ పరిశ్రమలకు సీసీఐ అందిస్తున్న సేవలను కొనియాడారు. 2031 వరకు అమలు చేసే పత్తి ఉత్పాదకత పెంపు, సబ్సిడీ పథకాలు, జిన్నింగ్ మిల్లుల్లో నాణ్యత పెంపు కార్యక్రమాల్లో తెలంగాణకు తొలి ప్రాధాన్యత కల్పించాలని కేంద్ర జౌళి మంత్రి, సీసీఐ అధికారులను కోరారు. తెలంగాణ రైతులు, పరిశ్రమలకు మరింత లాభదాయక వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులకు కపాస్ ప్లాకర్, కాటన్ స్టాక్ ష్రెడ్డర్ యంత్రాలను పంపిణీ చేయడంతో పాటు పత్తి రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.


