విద్యార్థులను అవమానించిన సీఎం రాజీనామా చేయాలి
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వెంకట్రామ థియేటర్ జంక్షన్ వద్ద బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన త్యాగాలను విస్మరించి ఇంజినీరింగ్ విద్యార్థులు, యువతను అవమానించేలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ యువత ప్రతిభ చాటుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతను ఏకం చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా తదితరులు పాల్గొన్నారు.

