యూఐడీఎఫ్ టెండర్లతో మాకు సంబంధం లేదు
నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు
రాజకీయ దుష్ప్రచారాన్ని సహించబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్: యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ పర్యటనలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో సమావేశమైన ఆయన, సంబంధం లేని అంశంలో బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసే వారికి వెంటనే లీగల్ నోటీసులు జారీ చేసి, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. యూఐడీఎఫ్ టెండర్ల వ్యవహారంలో తమకు ఎలాంటి పాత్ర లేదని మరోసారి స్పష్టం చేసిన బండి సంజయ్, రాజకీయ దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించబోమన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారే ఇప్పుడు ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు పారదర్శక పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని, తప్పుడు ప్రచారాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు.

