ఖాకీలకు నేర మరకలు
కరీంనగర్ పోలీసు శాఖలో వరుస ఘటనలు కలకలం
ప్రత్యర్థిపై గంజాయి కేసు బనాయించిన కానిస్టేబుల్ అరెస్టు
డ్రంక్ అండ్ డ్రైవ్ అక్రమాలపై ముగ్గురు సస్పెన్షన్
తప్పు చేసిన వారిపై వేటు వేస్తున్నా… మారరా ఖాకీలు?
కాకతీయ, కరీంనగర్ : ప్రజలకు చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు శాఖలోనే వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు కరీంనగర్ పోలీసు కమిషనరేట్ ప్రతిష్ఠపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు భూ వివాదంలో ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి కేసు బనాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు కావడం… మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ముగ్గురు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడటం… ఒకే వారంలో జరిగిన ఈ రెండు పరిణామాలు పోలీసు శాఖలో క్రమశిక్షణపై తీవ్ర చర్చకు దారితీశాయి. తప్పు చేసిన వారిపై కమిషనరేట్ రాజీలేని చర్యలు తీసుకుంటున్నప్పటికీ… వరుసగా ఇలాంటి ఘటనలు బయటపడుతుండటంతో “ఖాకీల్లో అసలు ఏమి జరుగుతోంది?” అనే ప్రశ్న వినిపిస్తోంది.
ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి కేసు..!
సివిల్ భూ వివాదంలో తనకు పరిచయం ఉన్న వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించేందుకు ప్రత్యర్థిపై గంజాయి కేసు నమోదు చేయించేలా ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు కుట్ర పన్నినట్లు కొత్తపల్లి పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి షాపులో గంజాయి ఉంచించి కేసు నమోదయ్యేలా ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. అనంతరం మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని తన ఇంట్లో దాచిపెట్టినట్లు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసే అక్రమ కేసు బనాయించే ప్రయత్నం చేయడం శాఖలో సంచలనంగా మారింది.
డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ అక్రమాలు
మరోవైపు ట్రాఫిక్ విభాగంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై పోలీసు కమిషనరేట్ వెంటనే స్పందించింది. ప్రత్యేక కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు కానిస్టేబుళ్లు కిరణ్ కుమార్, సాయికృష్ణలను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల భద్రత కోసం నిర్వహించే తనిఖీల్లోనే నిబంధనలు ఉల్లంఘించడం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఒకవైపు తప్పు చేసిన వారిని గుర్తించి శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటూ పోలీసు కమిషనరేట్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. మరోవైపు వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు శాఖలో అంతర్గత పర్యవేక్షణ, పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చట్టం ముందు ఎవరూ అతీతులు కారనే సందేశాన్ని ఉన్నతాధికారులు ఇస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖలో మరింత కఠినమైన పర్యవేక్షణ, జవాబుదారీతనం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి కేసు కుట్ర… డ్రంక్ అండ్ డ్రైవ్ అక్రమాలు… రెండు ఘటనలు రెండు విభాగాల్లో జరిగినా, పోలీసు శాఖలో క్రమశిక్షణకు సవాల్ విసిరిన సంఘటనలుగానే నిలిచాయి. తప్పు చేసిన వారిపై చర్యలు కొనసాగుతున్నా… ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది.

