గబ్బిలాల సాకుతో చేతులెత్తేసిన విద్యుత్ శాఖ..!
కరెంట్ లేక ఉక్కిరిబిక్కిరైన పోచమ్మకుంట ప్రజలు
‘గబ్బిలాలు పడ్డాయి’ అంటూ అధికారులు చెప్పిన సమాధానంపై విమర్శలు
కాకతీయ, హనుమకొండ: హనుమకొండ జిల్లా డబ్బాల ప్రాంతం, పోచమ్మకుంటలో బుధవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోవడంతో ఉక్కపోత, దోమల మధ్య ప్రజలు అల్లాడిపోయారు. విద్యుత్ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ విద్యుత్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా, “గబ్బిలాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది” అని అధికారులు చెప్పినట్లు ఆయన ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అధికారులు విచిత్రమైన సమాధానాలు చెప్పడం బాధాకరమని ఆయన విమర్శించారు. విద్యుత్ అధికారులతో పేరం గోపికృష్ణ జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యుత్ అంతరాయానికి గల అసలు కారణాలను పారదర్శకంగా వెల్లడించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రజలకు సమయానుకూల సమాచారం అందిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

