కాకర్ల సమత లొంగుబాటు
నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో
ఎట్టకేలకు జనజీవన స్రవంతిలోకి సీనియర్ నాయకురాలు
పునరావాసానికి ప్రభుత్వం భరోసా..
ఆరోగ్య కార్డులు, ఉపాధి శిక్షణ, రుణాల సాయం
డీఐజీ సీవీ ఆనంద్ వెల్లడి
కాకతీయ, ములుగు ప్రతినిధి : దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో కొనసాగిన సీనియర్ నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవి, షకీలా, దుర్గా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆమె లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని డీఐజీ సీవీ ఆనంద్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య రక్షణ కార్డులు, ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు, అవసరమైన ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ కార్యాలయంలో సమత లొంగుబాటు వివరాలను ఆయన వెల్లడించారు. 1985లో వైజాగ్ ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలతో ప్రభావితమైన సమత అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారని డీఐజీ తెలిపారు. అప్పటి నుంచి సుమారు 40 ఏళ్లపాటు వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి పనిచేశారని చెప్పారు. హైదరాబాద్ కమిటీ, నల్లమల, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక–మహారాష్ట్ర ఉమ్మడి కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు వివరించారు. పార్టీ డాక్యుమెంటేషన్, సిద్ధాంతపరమైన పత్రాల రూపకల్పన, అనువాదాలు, మహిళా సమస్యలపై రచనలు, క్యాడర్‌కు శిక్షణ వంటి బాధ్యతలు కూడా నిర్వహించారని తెలిపారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతికి సీసీ స్టాఫ్ మెంబర్‌గా పనిచేసినట్లు పేర్కొన్నారు.
23 మందికి రూ.2 కోట్ల సాయం
సమత కుటుంబంలోనూ మావోయిస్టు నేపథ్యం ఉందని డీఐజీ తెలిపారు. ఆమె సోదరి కాకర్ల సునీత అలియాస్ బద్రి గత ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. సమత భర్త పటేల్ సుధాకర్‌రెడ్డి మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసి 2010లో ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు వెల్లడించారు. ఇప్పటికే 23 మంది లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద దాదాపు రూ.2 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఉపాధి కోసం శిక్షణ, రుణాలు, వైద్య సహాయం అందిస్తూ వారిని సమాజంలో గౌరవప్రదంగా స్థిరపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రస్తుత జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న నాయకులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీఐజీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. వారి సమస్యలు, కేసులకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైతే కేంద్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతోనూ చర్చిస్తామని తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలకు గతంలో కీలకంగా ఉన్న ప్రాంతం కావడంతోనే ములుగులో కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

