యూరియా ధర పెంచారా?
రూ.266 బస్తా.. రూ.300కు విక్రయం
రవాణా ఖర్చుల పేరుతో రూ.34 అదనపు వసూలు
అధికారుల అనుమతి ఉందా.. అయోమయంలో రైతన్నలు
కాకతీయ,నర్సంపేట టౌన్ : యూరియా బస్తా ధర విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266 కాగా, నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లోని సహకార సొసైటీల్లో అదే యూరియా బస్తాను రూ.300కు విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చుల పేరుతో బస్తాకు అదనంగా రూ.34 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో యూరియా ధర పెంచారా.. లేక రవాణా ఖర్చుల పేరుతో అదనపు మొత్తం వసూలు చేస్తున్నారా అన్నది స్పష్టత లేక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పీఏసీఎస్‌లకు ఎరువుల ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రభుత్వం ఇటీవల నిలిపివేసినట్లు సమాచారం. జూలై 8న వ్యవసాయశాఖ నుంచి దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. దీంతో సొసైటీలపై రవాణా భారం పడే అవకాశం ఉంది. అయితే ఆ భారాన్ని రైతులపై మోపి బస్తాకు అదనంగా రూ.34 వసూలు చేసే అధికారం సొసైటీలకు ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రూ.34కు లెక్క చెప్పాలి
రూ.266 ఎంఆర్‌పీ ఉన్న యూరియా బస్తాను రూ.300కు విక్రయిస్తే అదనంగా తీసుకుంటున్న రూ.34కు లెక్క చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రవాణా ఖర్చు పేరుతో ఎంత వసూలు చేయాలి, అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఉంది, అదనపు మొత్తానికి రైతులకు రశీదు ఇస్తున్నారా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఉచిత రవాణా సదుపాయం రద్దయినంత మాత్రాన యూరియా ధర పెరిగిందా? లేక రవాణా ఖర్చును రైతుల నుంచి ప్రత్యేకంగా వసూలు చేసుకోవచ్చా? అనే విషయాన్ని వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.300కు విక్రయించేందుకు అధికారిక అనుమతి ఉంటే సంబంధిత ఉత్తర్వులను బహిర్గతం చేయాలని, అనుమతి లేకుంటే అదనపు వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

