పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రతి బూత్‌ను పటిష్ఠం చేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి
పెంబర్తిలో కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీ సమావేశం
కాకతీయ, హనుమకొండ : గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు హసన్‌పర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్. అశోక్, పార్టీ గ్రామ ఇన్‌చార్జి ఈర్ల చిన్ని సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. నూతనంగా ఏర్పాటైన గ్రామ కమిటీ సభ్యులను ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అభినందించారు. గ్రామంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీకి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో గ్రామ కమిటీల పాత్ర కీలకమని ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, యువత, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల కోసం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పునాది ఉంటేనే కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు ప్రతి బూత్‌ను పటిష్ఠం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నూతన గ్రామ కమిటీ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

