సుద్దాల చిన్నారి అరుదైన ఘనత
ప్రకృతి బ్లెస్సీ.. 12 ఏళ్లకే ప్రపంచ రికార్డు
హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ప్రకృతి పరిరక్షణకు మూడు రాష్ట్రాల్లో 2.65 లక్షల విత్తనాలు
కాకతీయ, కొనరావుపేట : మూడేళ్ల వయసులో విత్తనాలు సేకరించడం ప్రారంభించిన సుద్దాల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ.. 12 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె, పద్మశ్రీ వనజీవి హరిత అవార్డు గ్రహీత ప్రకృతి బ్లెస్సీకి హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. ప్రస్తుతం బద్దెనపల్లి గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న ఆమె ప్రకృతి పరిరక్షణ కోసం చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. చిన్నతనం నుంచే చెట్లు, అడవులు, పర్యావరణంపై ఆసక్తి పెంచుకున్న ప్రకృతి బ్లెస్సీ మూడేళ్ల వయసు నుంచే చెట్ల కింద రాలిన విత్తనాలను సేకరించింది. వాటిని మట్టితో కలిపి విత్తన బంతులుగా తయారు చేసి, తండ్రి ప్రకాష్ సహకారంతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో చల్లుతూ పచ్చదనం పెంపునకు కృషి చేసింది.
2.65 లక్షల విత్తనాలతో పచ్చని బాట
తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటివరకు 2.65 లక్షల విత్తనాలు, విత్తన బంతులను వేసినట్లు తెలిపారు. చిన్న వయసులోనే ప్రకృతి పరిరక్షణకు ఇంతటి స్థాయిలో కృషి చేసినందుకు హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు ఈ గుర్తింపు అందించింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇందూర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్‌రెడ్డి, సీఈవో సుమన్ పల్లె చేతుల మీదుగా ప్రకృతి బ్లెస్సీ అందుకుంది. తనకు లభిస్తున్న అవార్డులు, రికార్డులు ప్రకృతి సంరక్షణపై బాధ్యతను మరింత పెంచాయని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ప్రకృతి బ్లెస్సీ ఘనతపై బద్దెనపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, మహతే దేవాయ ఫౌండేషన్ ప్రతినిధులు, సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు, కొనరావుపేట మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లన్న అభినందనలు తెలిపారు.

