క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ల రిజిస్ట్రేషన్ ఇక ఆన్‌లైన్
సీఈఏ వెబ్‌సైట్, డిజిటల్ రిజిస్ట్రేషన్‌పై అధికారులకు శిక్షణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు ఇకపై తెలంగాణ సీఈఏ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (సీఈఏ) వెబ్‌సైట్, డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానంపై బుధవారం వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులకు అవగాహన శిక్షణ నిర్వహించారు.
జాయింట్ డైరెక్టర్ సీఈఏ డా. ప్రభు కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఈఏ రాష్ట్ర బృంద సభ్యులు సునీల్‌రాజ్, కిరణ్‌కుమార్, అనిల్‌కుమార్, మొయినుద్దీన్ వెబ్‌సైట్ వినియోగం, ఆన్‌లైన్ దరఖాస్తు విధానంపై శిక్షణ ఇచ్చారు. వరంగల్ డీఎంహెచ్‌వో డా. బి. రాజారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఐదు జిల్లాల డీఎంహెచ్‌వోలు, సీఈఏ సిబ్బంది శిక్షణలో పాల్గొన్నట్లు తెలిపారు.
సీఈఏ చట్టం ప్రకారం అల్లోపతి, ఆయుష్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్, ఫిజియోథెరపీ కేంద్రాలు తదితర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. హనుమకొండ, సిద్దిపేటలో పైలట్‌గా అమలు చేసిన డిజిటల్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ఇకపై డిజిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

