వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఎఫ్‌బీఓ బలి
★ విధి నిర్వహణలో విషాదం.. భానోత్ నవీన్ మృతి
కాకతీయ, కారేపల్లి: వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్ ఉచ్చు అటవీశాఖ ఉద్యోగి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. నకిరిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సింగరేణి మండలం వెంకట్యాతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ భానోత్ దేవ్లా నాయక్ కుమారుడు భానోత్ నవీన్ చెరువు సింగారం వెస్ట్ బీట్‌లో ఎఫ్‌బీఓగా (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆయన వన్యప్రాణుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్ ఉచ్చుకు గురైనట్లు సమాచారం. విద్యుత్ షాక్‌కు గురై నవీన్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేటను అరికట్టాల్సిన క్రమంలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ ఉద్యోగి విద్యుత్ ఉచ్చుకు బలికావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అక్రమంగా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేస్తున్న వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ ఉచ్చును ఎవరు ఏర్పాటు చేశారు? దాని వెనుక ఉన్న వ్యక్తులెవరు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


