బల్దియాలో ఖాళీ పోస్టుల గందరగోళం
3 సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీ
ఆర్వోలపై అదనపు పనిభారం
సీనియార్టీని పక్కనపెట్టి పోస్టుల భర్తీపై ఆరోపణలు
డిప్యూటేషన్ సూపర్ కోసం సర్కిల్ లాబీయింగ్
టేబుల్ పని వద్దు.. ఫీల్డ్ పోస్టే కావాలి
సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకపోవడంతో జీడబ్ల్యూఎంసీలో పరిపాలనా వ్యవస్థ గందరగోళంగా మారిందని ఉద్యోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. బల్దియాలో 3 సూపరింటెండెంట్ పోస్టులు నెలలుగా ఖాళీగా ఉండటంతో వాటి పనులను కాశీబుగ్గ, ఖాజీపేట సర్కిళ్ల ఆర్వోలపై అదనంగా రుద్దారని చెబుతున్నారు. ఫీల్డ్‌లో తిరుగుతూ విధులు నిర్వహించాల్సిన ఆర్వోలకు కార్యాలయ పనులు కూడా అప్పగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. కాశీబుగ్గ ఆర్వో సముద్రాల రామకృష్ణ ఆరోగ్యం సహకరించడం లేదని, రెండు పోస్టులకు న్యాయం చేయలేనని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఖాజీపేట ఆర్వో గుర్రపు శ్రీను ఈ రెండు బాధ్యతలతో పాటు ఆర్డీ పనులు కూడా చూడాల్సి వస్తోందని ఆర్డీ షాహిద్ మసూద్ ద్వారా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
డిప్యూటేషన్ సూపర్ కోసం సర్కిల్ పోటీ
కరీంనగర్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన సూపరింటెండెంట్ టి. బాబుకు సర్కిల్ కేటాయింపుపై లాబీయింగ్ మొదలైనట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది. ఇంటికి దగ్గరగా ఉండే ఖాజీపేట సర్కిల్ కావాలంటూ అదనపు కమిషనర్ చుట్టూ తిరుగుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఆర్వోలు కూడా ఆయనను తమ సర్కిల్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పోస్టుల కేటాయింపులో సీనియార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆర్వో పోస్టులను సీనియార్టీ ప్రకారం కాకుండా డబ్బులు ఇచ్చి పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సౌకర్యవంతమైన సూపరింటెండెంట్ పోస్టు కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువ బాధ్యతలు ఉండే ఆర్వో పోస్టు కోసం పోటీ పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
అమ్యమ్యాల కోసమేనా
డిప్యూటేషన్‌పై వచ్చిన సూపరింటెండెంట్‌కు సర్కిల్ కేటాయింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలు పని తగ్గించుకోవడం కోసం కాకుండా అదనంగా వచ్చే అమ్యమ్యాల కోసమేనని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితి ఉంటే కార్యాలయంలో టేబుల్ వర్క్ ఉండే సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకోవచ్చని, అయినప్పటికీ ఆర్వో పోస్టుపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాలో ఖాళీగా ఉన్న 3 సూపరింటెండెంట్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టి, ఆర్వోలపై అదనపు పనిభారం తొలగించాలని కోరుతున్నారు. పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించాలని, ఆరోపణలకు తావులేకుండా స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

