ఎన్‌సీడీ లక్ష్యాలను 100% సాధించాలి
30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ తప్పనిసరి
మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ పరీక్షలు చేయాలి
గుర్తించిన కేసుల్లో 80 శాతానికి పైగా చికిత్సలోకి తీసుకురావాలి
ఆశా, ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ డా. రాజా రెడ్డి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జాతీయ అసంక్రమిక వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్‌సీడీ) లక్ష్యాలను నిర్ణీత గడువులోగా 100 శాతం సాధించాలని డీఎంహెచ్‌ఓ డా. బి. రాజా రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌సీడీ కార్యక్రమంపై ఆయన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. నెలాఖరులోగా 100 శాతం స్క్రీనింగ్ పూర్తి చేసి, గుర్తించిన కేసుల్లో 80 శాతానికి పైగా నిర్ధారణ చేసి చికిత్సలోకి తీసుకురావాలని ఆదేశించారు. స్క్రీనింగ్, రిఫరల్ కేసులను ఆరోగ్య కేంద్రాలకు తీసుకురావడంలో ఆశా కార్యకర్తల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలోని ప్రతి ఇంటి ఎన్‌సీడీ ప్రొఫైల్‌ను సిద్ధంగా ఉంచాలని, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్స వివరాలను రోజువారీగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, వైద్యాధికారులు వాటిని క్రాస్‌చెక్ చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డా. సయ్యద్ ఇక్తిదార్ అహ్మద్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్లు ఆర్. ప్రకాష్, ఎన్. శ్రీనివాస్ కర్ణ తదితరులు పాల్గొన్నారు.

