దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సంక్షేమ ఫలాలు అందిస్తాం : మంత్రి పొంగులేటి
ఉచితంగా త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్ల పంపిణీ
ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపు
కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. రవాణా సౌకర్యాన్ని సులభతరం చేసేందుకు ట్రై మోటార్ సైకిళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. దివ్యాంగత్వాన్ని వైకల్యంగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
స్వయం సమృద్ధి సాధించాలి
పట్టుదల, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని మంత్రి అన్నారు. దివ్యాంగులు సమాజంలో స్వయం సమృద్ధి సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దివ్యాంగ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

