భూసేకరణ బాధితులకు న్యాయం చేస్తాం
రైతులకు పూర్తిస్థాయి పరిహారం
కాలువ నిర్మాణంతో సాగునీటి సౌకర్యం
రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం
గ్రామసభలో ఆర్డీవో టి.సుమ
కాకతీయ, రాయపర్తి : దేవాదుల ఎత్తిపోతల పథకం (జేసీఆర్ డీఎల్‌ఐఎస్)లో భాగంగా నక్కల్ కెనాల్ కాలువ డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతులు, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని ఆర్డీవో టి.సుమ స్పష్టం చేశారు. శనివారం కొలనుపల్లి, కేశవపురం, బురాన్‌పల్లి గ్రామాల్లో కాలువ నిర్మాణంపై నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆమె మాట్లాడారు. కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంటలకు నీరు అందడంతోపాటు ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు, బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, నవాబ్ తహసీల్దార్ త్రినాథ్, సర్పంచులు వంగాల ఎల్లమ్మ, సూదుల ఉమాదేవి, గుజె సుధాకర్, ఆర్‌ఐ చంద్రమోహన్, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

