కాకతీయ ఎఫెక్ట్
ప్రజా వైద్యంతో చెలగాటమా
‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ కథనంపై ఎమ్మెల్యే తక్షణ స్పందన
రాయపర్తి పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు
వార్డులు, మందుల నిల్వలు, హాజరు రిజిస్టర్ల పరిశీలన
సాయంత్రం 4 గంటలకే ఆసుపత్రికి తాళాలు వేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం
రోగులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

కాకతీయ, రాయపర్తి : ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 22న ‘ఉత్తరం కాకతీయ’ దినపత్రికలో ‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. సాయంత్రం నాలుగు గంటలకే ఆసుపత్రికి తాళాలు వేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించడంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను వెంటనే కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాకతీయ కథనంపై తక్షణమే స్పందించి పీహెచ్సీని సందర్శించడంతో మండల ప్రజలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి అరుణ్ చంద్ర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


