హంటర్ రోడ్డులో మీడియన్ కటింగ్ మూసివేత
విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రయోగాత్మక చర్యలు
న్యూ సైన్స్ కాలేజీ సమీపంలోని కటింగ్ తాత్కాలికంగా మూసివేత
కాకతీయ, హన్మకొండ : హనుమకొండ పట్టణంలోని హంటర్ రోడ్డులో అదాలత్ జంక్షన్ నుంచి నీలిమ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతోపాటు విద్యార్థుల సురక్షిత రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో పాఠశాలలు, కళాశాలలు అధికంగా ఉండటంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంతోపాటు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు హంటర్ రోడ్డులోని సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. మీడియన్ కటింగ్ మూసివేతతో వాహనదారులు ఇష్టానుసారంగా యూటర్న్‌లు తీసుకోవడం, రహదారిపై అకస్మాత్తుగా దిశ మార్చుకోవడం వంటి పరిస్థితులను నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో విద్యార్థుల రాకపోకల సమయంలో ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. ఈ మార్పును వరంగల్ పట్టణ ప్రజలు, వాహనదారులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. హంటర్ రోడ్డులో ముఖ్యంగా విద్యార్థులు, పాదచారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, వేగ నియంత్రణ పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన మీడియన్ కటింగ్ మూసివేత అనంతరం ట్రాఫిక్ పరిస్థితులను అధికారులు పరిశీలించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

