ములుగు మిల్లర్లలో గుబులు!
ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం
అధ్యక్షుడు సతీష్ పేరుతో వైరలవుతున్న ఓ సందేశం
బెయిల్ వచ్చే వరకు బయట కనిపించొద్దంటూ సూచనలు?
ఫోన్‌లోనూ అందుబాటులో ఉండొద్దని మెసేజ్‌లో ప్రస్తావన
మిల్లర్ల ఆచూకీపై ములుగు జిల్లాలో హాట్ టాపిక్
సీఐడీ తదుపరి చర్యలపై రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో ఉత్కంఠ

అసోసియేషన్ నూతన జిల్లా అధ్యక్షుడు కాట్రగడ్డ సతీష్‌తో మిల్లర్లు
కాకతీయ, ములుగు(ఏటూరునాగారం) : ములుగు జిల్లా రైస్ మిల్లర్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25న అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో బాదం ప్రవీణ్‌తో పాటు మరో ఐదుగురు మిల్లర్లను సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో మిల్లర్లలో ఆందోళన నెలకొందనే ప్రచారం సాగుతోంది. తాజాగా అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ సతీష్ పేరుతో మిల్లర్లకు పంపినట్లు చెబుతున్న వాట్సాప్ సందేశం వైరల్ కావడం కలకలం రేపుతోంది. ముందస్తు బెయిల్ వచ్చే వరకు బయట కనిపించవద్దని, ఫోన్‌లోనూ అందుబాటులో ఉండొద్దని అందులో సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సందేశాన్ని సతీష్ పంపించారా? అందులోని వివరాలు నిజమేనా? అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ నెల 25న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బాదం ప్రవీణ్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనతో పాటు మరో ఐదుగురు మిల్లర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ పరిణామాల మధ్య ప్రవీణ్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కాట్రగడ్డ సతీష్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న అరెస్టులు, ఆ తర్వాత వైరల్ అయిన సందేశం మిల్లర్ల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి.
‘బయట కనిపించొద్దు’.. మెసేజ్‌లో ఏముంది?
సతీష్ పేరుతో ప్రచారంలో ఉన్న సందేశంలో ‘గ్రేడ్-ఏ టు కామన్’ బియ్యం మార్పిడి వ్యవహారాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయవాదితో మాట్లాడామని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెయిల్‌పై స్పష్టత వచ్చే వరకు రెండు రోజులపాటు బయట కనిపించకుండా ఉండాలని, ఫోన్‌లోనూ అందుబాటులో ఉండవద్దని సూచించినట్లు సందేశంలో ఉందని చెబుతున్నారు. చివరలో ‘మీ ప్రెసిడెంట్ సతీష్’ అని ఉండటంతో సందేశం చుట్టూ చర్చ మొదలైంది. అయితే సందేశం అసలైనదా? ఎవరు పంపించారు? దాని వెనుక ఉన్న వాస్తవాలేమిటి? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. వైరల్ సందేశం నేపథ్యంలో సతీష్‌తో పాటు మరికొందరు మిల్లర్లు అందుబాటులో లేరని, పరారయ్యారనే ప్రచారం మొదలైంది. అయితే వారి ప్రస్తుత ఆచూకీపై అధికారిక సమాచారం లేదు. కేవలం సందేశం ఆధారంగా వారు పరారయ్యారని నిర్ధారించడం సాధ్యం కాదు. సంబంధిత వ్యక్తుల వివరణ, అధికారుల ప్రకటన వెలువడితేనే ఈ ప్రచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సీఐడీ తదుపరి అడుగులపై ఉత్కంఠ
సీఎంఆర్ బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో గతంలో పలు మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు జరిగినట్లు సమాచారం. తాజాగా ఆరుగురు మిల్లర్ల అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో దర్యాప్తు ఎటువైపు సాగుతుందన్న ఆసక్తి నెలకొంది. వైరల్ సందేశంపై సీఐడీ దృష్టి సారిస్తుందా? అధ్యక్షుడు కాట్రగడ్డ సతీష్‌తో పాటు ఇతర మిల్లర్ల పాత్రపై విచారణ చేపడుతుందా? అన్నది వేచి చూడాలి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల అధికారిక వివరణ రావాల్సి ఉంది.

