ఎల్‌నినోను ఎదుర్కొంటాం
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రానివ్వం!
డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం
ఎన్‌పీడీసీఎల్ పరిధిలో అక్టోబరులో 6,700 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా అదే నెలలో 20,018 మెగావాట్ల రికార్డు వినియోగం
వేసవి కార్యాచరణలో భాగంగా 4,500 పంపిణీకి ట్రాన్స్‌ఫార్మర్లు
మూడు నెలలకు సరిపడా ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు…కొరత లేదు
దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను సాధ్యమైనంత వరకు 24 గంటల్లో మారుస్తాం
పంటల అవసరాలను బట్టి రాత్రివేళల్లో అదనపు విద్యుత్ సరఫరా
క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తున్నాం
: ఎల్‌నినో ప్రభావం–విద్యుత్ సరఫరాలోని సవాళ్లు’ అనే అంశంపై టీడీఎంయూ ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ఉత్తరం కాకతీయ, ఎడిటర్/ అరెల్లి కిరణ్ గౌడ్ :
ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత, వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ డిమాండ్ అసాధారణంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేం అన్ని విధాలుగా సన్నద్ధమయ్యాం. ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే మా లక్ష్యం. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. వ్యవసాయ అవసరాలకు అదనపు విద్యుత్ అందించడంతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్న వెంటనే మార్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. విద్యుత్ వినియోగం, నీటి పొదుపుపై ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. మా శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ‘ఎల్నినో ప్రభావం–విద్యుత్ సరఫరాలోని సవాళ్లు’ అంశంపై తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..!

ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం
విద్యుత్ వినియోగం పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో గృహాలు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం అధికమైంది. మరోవైపు భూగర్భ జలాలు తగ్గడంతో వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరిగింది. సాధారణంగా ఏటా విద్యుత్ డిమాండ్ 7 నుంచి 10 శాతం పెరుగుతుంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది అక్టోబరులో గరిష్ఠ డిమాండ్ 3,762 మెగావాట్లుగా నమోదైంది. ఈ ఏడాది అదే నెలలో అది 6,700 మెగావాట్లకు చేరింది. గత నెలలో దాదాపు 7,000 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈసారి గరిష్ఠ డిమాండ్ సుమారు 67 శాతం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో 18,548 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవగా, అక్టోబరులోనే 20,018 మెగావాట్ల రికార్డు డిమాండ్ నమోదైంది. ఈ గణాంకాలు విద్యుత్ అవసరాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. అందుకే పరిస్థితి తీవ్రతను ముందుగానే అంచనా వేసి పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తున్నాం.

4,500 ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధం చేశాం
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సుమారు 4,500 పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశాం. పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ఉపకేంద్రాల్లో ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాం. కొత్తగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశాం. 57 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నాం. అందుకే ఇప్పటి నుంచే తదుపరి దశ పనులను ప్రారంభించాం. ఎక్కడ విద్యుత్ లోడ్ పెరిగే అవకాశముందో ముందుగానే గుర్తిస్తున్నాం. అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం, కొత్త లైన్లు వేయడం, భూగర్భ విద్యుత్ లైన్లను నిర్మించడం వంటి పనులు చేపడుతున్నాం. ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. వాటి సరఫరా ప్రారంభమైంది. పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా కూడా కొనసాగుతోంది. లైన్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల పనులను డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మధ్యలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డిమాండ్ మరింత పెరిగే సమయానికి వ్యవస్థ సిద్ధంగా ఉండేలా పనులను వేగవంతం చేస్తున్నాం.

రైతులకు విద్యుత్ అందించడమే ప్రాధాన్యం
వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కొన్ని ఉపకేంద్రాల పరిధిలో గత ఏడాదితో పోలిస్తే డిమాండ్ 70 నుంచి 80 శాతం వరకు పెరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం వృద్ధి నమోదైంది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పొలాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటు, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి పనులు చేపట్టాం. ముందస్తు ఏర్పాట్ల వల్ల పెరిగిన డిమాండ్‌ను విద్యుత్ వ్యవస్థ తట్టుకోగలుగుతోంది. రైతులకు అవసరమైన విద్యుత్ అందించేందుకు అన్ని జిల్లాల్లో మూడు నెలలకు సరిపడా పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలను సిద్ధంగా ఉంచాం. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు వెంటనే స్పందించేందుకు అదనంగా సుమారు 40 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్లి దెబ్బతిన్నదాన్ని మార్చి, పాడైన దాన్ని తిరిగి తీసుకొస్తున్నాం. సాధ్యమైనంత వరకు 24 గంటల్లోపే మార్పిడి పూర్తి చేస్తున్నాం. రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడకుండా అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.

పంటల అవసరాలను బట్టి అదనపు సరఫరా
వరి పంటలకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి. వచ్చే 15, 30, 45, 60 రోజుల్లో పంట కోతకు వచ్చే ప్రాంతాలను గుర్తించి నవంబరు చివరి వరకు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా ప్రణాళిక సిద్ధం చేశాం. కోతకు మరో 15 నుంచి 20 రోజుల సమయం ఉన్న ప్రాంతాల్లో వరికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని గుర్తించాం. అలాంటి మండలాల్లో రాత్రివేళల్లో అదనపు విద్యుత్ అందిస్తున్నాం. రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక విడతగా, ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మరో విడతగా అదనపు సరఫరా చేస్తున్నాం. రైతులతో చర్చించి, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా అధికారులు ఉదయం ఆరు గంటలకంటే ముందే ఉపకేంద్రాలు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. రైతులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుంటున్నారు. తక్కువ వోల్టేజీ సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నారు. పంటల దశ, నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
అధిక లోడ్‌ను నియంత్రిస్తూ..
ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యానికి మించి మోటార్లు ఏర్పాటు చేయడం కూడా వైఫల్యాలకు ఒక కారణం. చెరువులు, కాలువల నుంచి నీటిని తోడేందుకు అదనపు మోటార్లు ఏర్పాటు చేయడం, బోరుబావులకు మరిన్ని మోటార్లు అమర్చడం, పాత బావులను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల విద్యుత్ లోడ్ పెరుగుతోంది. అలాంటి ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. తక్కువ వోల్టేజీ సమస్యలు ఎదురైనప్పుడు ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్ల ట్యాప్స్ సర్దుబాటు చేయడం, కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. అదే సమయంలో నీటి వినియోగంపైనా రైతులు దృష్టి పెట్టాలి. వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలతోపాటు, సాధ్యమైన చోట ఆరుతడి పంటలను సాగు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల భూగర్భ జలాలు మరింతగా అడుగంటకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ సరఫరా నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నా, వాటిని అధిగమించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ముందస్తు ప్రణాళిక, మౌలిక సదుపాయాల బలోపేతం, ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు, రైతులతో సమన్వయం మా కార్యాచరణలో కీలకమైనవి. ప్రజలు, రైతుల్లో విద్యుత్ వినియోగం, నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నాం. మా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి.

