హరిత సాంకేతికతలతోనే ఎంఎస్‌ఎంఈలకు లాభాలు
ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్
కాకతీయ, ములుగు ప్రతినిధి : చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు హరిత సాంకేతికతలను విస్తృతంగా స్వీకరించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంతోపాటు మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవచ్చని ఆర్‌ఐసీహెచ్ ప్రాజెక్ట్ మేనేజర్–సస్టైనబిలిటీ గురు చరణ్ ఉప్పరపల్లి అన్నారు. ములుగు రైస్ మిల్ అసోసియేషన్ సహకారంతో ఆర్‌ఐసీహెచ్ ఆధ్వర్యంలో మంగళవారం ములుగులో ఆర్‌ఏఎంపీ–గ్రీటింగ్స్ ఆఫ్ ఎంఎస్‌ఎంఈ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన వినియోగం ప్రధాన వ్యయ అంశమని, ఆధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం, నీటి పొదుపు, ముడి పదార్థాల సమర్థ వినియోగం, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. హరిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యాపార స్థిరత్వం, ఉత్పత్తి వ్యయాల నియంత్రణకు దోహదపడతాయని పేర్కొన్నారు. ములుగు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రైస్ మిల్లులు సౌర విద్యుత్, ఇంధన సామర్థ్య సాంకేతికతలను స్వీకరించి విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. యంత్రాల సామర్థ్యం, వనరుల సమర్థ వినియోగం పెంచడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

