కాంగ్రెస్‌లోనే ఉంటారా..?
బీజేపీలోకి వెళ్తే ఇముడుతారా..?!
పొలిటికల్ క్రాస్‌రోడ్‌లో కొండా కపుల్స్
సంధికాలంలో నిర్ణయం సందిగ్ధమే..!
బీజేపీ ఎంపీ అరవింద్ నుంచి ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానం
బండి సంజయ్, ఈటల నుంచి కూడా సానుకూల సంకేతాలు
బీజేపీ బీసీ నినాదానికి కొండా దంపతుల చేరిక ఊతమిస్తుందన్న అంచనా
స్వతంత్ర భావజాలంతో ఉన్న దంపతులకు ఆ పార్టీ సరిపోతుందా?
సైద్ధాంతిక, అధిష్ఠాన ఆలోచనలతో కాషాయం పార్టీలో ఇమడగలరా?
జనసేన వైపు వెళ్లాలన్న శ్రేణుల్లోని ఓ వర్గం సూచన
బీఆర్‌ఎస్‌తో గత విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పిలుపు కష్టమే
మొత్తంగా ఆప్షన్లు తక్కువ.. కన్ఫ్యూజన్ ఎక్కువ
ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే ఉంటామంటున్న సురేఖ
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన పరిణామాలతో కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక పార్టీ మారతారా? మారితే ఏ గూటికి చేరతారు? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు ప్రస్తుతానికి కాంగ్రెస్‌ను వీడే ఆలోచన లేదనే సంకేతాలు ఇస్తున్నా.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తీరు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తలెత్తిన రాజకీయ విభేదాలు, పార్టీ అధిష్ఠానంతో ఏర్పడిన దూరం నేపథ్యంలో కొండా దంపతుల తదుపరి అడుగు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్‌లో కొనసాగేందుకు పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించకపోగా.. మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఎంచుకోవడంలోనూ అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో కొండా దంపతులు ప్రస్తుతం రాజకీయ క్రాస్‌రోడ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది.
కాషాయ గూటి నుంచి ఆహ్వానాలు
కొండా సురేఖపై బర్తరఫ్ వేటు పడిన నేపథ్యంలో బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రావడం చర్చకు తావిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే కొండా దంపతులను బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వైపు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో రాజకీయంగా దూరం పెరిగిన పరిస్థితుల్లో కొండా దంపతులకు బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి బీసీ రాజకీయాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ బీసీ మహిళగా కొండా సురేఖకు ఉన్న రాజకీయ నేపథ్యం ఆ పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా మురళి కూడా వరంగల్ ప్రాంత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని కలిగి ఉండటం.. ఇద్దరూ కలిసి కాషాయం గూటికి చేరితే ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో తమకు బలం చేకూరుతుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లు సమాచారం.
సిద్ధాంతం.. సమీకరణాలే అసలు ప్రశ్న
అయితే బీజేపీలో చేరడం అంత సులువైన రాజకీయ సమీకరణం కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కొండా దంపతులు తమ రాజకీయ ప్రయాణంలో స్వతంత్ర భావజాలంతో వ్యవహరించిన నేతలుగా గుర్తింపు పొందారు. స్థానిక రాజకీయాల్లో తమ బలాన్ని, వ్యక్తిగత రాజకీయ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంలో కొండా దంపతులు ఎప్పుడూ వెనుకాడలేదన్న భావన ఉంది. అలాంటి రాజకీయ శైలికి బీజేపీ సైద్ధాంతిక విధానం, పార్టీ అధిష్ఠాన నిర్ణయాలు, సంస్థాగత క్రమశిక్షణ ఎంతవరకు సరిపోతాయన్నది కీలక ప్రశ్నగా మారింది. కాంగ్రెస్‌లోనే ముఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేసిన సురేఖ.. బీజేపీలో చేరితే ఆ పార్టీ విధానాలు, కేంద్ర నాయకత్వ నిర్ణయాలు, రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రాజకీయ స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే కొండా దంపతులు ఆ వ్యవస్థలో ఎంతవరకు ఇమడగలరన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. బీజేపీ నుంచి ఆహ్వానాలు ఉన్నా.. చేరిక విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ కొండా దంపతులు బేరీజు వేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణలో జనసేన ఉనికి ఎంత..?!
మరోవైపు కొండా దంపతులు జనసేన వైపు వెళ్లాలన్న సూచనలు కూడా శ్రేణుల్లోని ఓ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేనకు ఉన్న రాజకీయ విస్తరణ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతానికి కొండా దంపతుల నుంచి జనసేన వైపు వెళ్లే విషయంలో ఎలాంటి స్పష్టమైన సంకేతాలు లేవు. బీఆర్‌ఎస్ కూడా మరో ఆప్షన్‌గా కనిపించినా.. గతంలో ఆ పార్టీతో ఏర్పడిన విభేదాలు, అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి గులాబీ గూటికి చేరే అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదే రాజకీయ ప్రయాణాన్ని మరోసారి పునరావృతం చేస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌లో ఉంటారా?
ఇన్ని రాజకీయ సమీకరణాల మధ్య కొండా సురేఖ మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్‌ను వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీపై తమకు గౌరవం ఉందని, కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా పార్టీ అంతర్గత పరిణామాల కారణంగా తమకు టికెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. తాజా పరిణామాల తర్వాత కూడా వెంటనే పార్టీ మారే నిర్ణయం తీసుకోబోమన్నదే సురేఖ మాటల్లో స్పష్టమైంది. అయితే కాంగ్రెస్‌లో కొనసాగడం అంటే ప్రస్తుత నాయకత్వంతో ఏర్పడిన రాజకీయ విభేదాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బహిరంగంగా విభేదించిన తర్వాత మళ్లీ అదే పార్టీలో కొండా దంపతుల రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందన్నది ప్రశ్న. ముఖ్యంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన పరిణామం తర్వాత వారి అనుచరులు, రాజకీయ వర్గాల్లో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో పార్టీతో కలిసి పనిచేయడం ఎంతవరకు సాధ్యమన్నది కాలమే తేల్చాల్సి ఉంది.
సంధికాలంలో సందిగ్ధమే
ప్రస్తుతం కొండా దంపతుల ముందు స్పష్టమైన రాజకీయ ఆప్షన్ కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో కొనసాగితే ప్రస్తుత నాయకత్వంతో సయోధ్య ఎలా? బీజేపీలో చేరితే ఆ పార్టీ సిద్ధాంత, సంస్థాగత వ్యవస్థలో ఎంతవరకు ఇమడగలరు? జనసేన వైపు వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో తమకు ఎంత మేర రాజకీయ స్థలం లభిస్తుంది? బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వెళ్తే గత విభేదాలను ఎలా అధిగమిస్తారు? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అందుకే కొండా దంపతులు ప్రస్తుతం రాజకీయంగా ఒక సంధికాలంలో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సురేఖ మాటల్లో కాంగ్రెస్‌పై అభిమానం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బర్తరఫ్ పరిణామంపై ఆమె వ్యక్తం చేస్తున్న అసంతృప్తి కూడా అంతే తీవ్రంగా ఉంది. పార్టీ వీడే ఆలోచన లేదని చెబుతున్నా.. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై మాత్రం తక్షణ నిర్ణయం ప్రకటించలేదు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్త కొండా మురళితో చర్చించిన తర్వాతే తదుపరి అడుగుపై నిర్ణయం తీసుకుంటానని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. అందువల్ల ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే.. కానీ భవిష్యత్తు మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన దశలోనే అన్న పరిస్థితి కొండా దంపతుల రాజకీయ ప్రయాణంలో కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఆహ్వానాలు, ఇతర పార్టీలపై జరుగుతున్న చర్చలు.. కాంగ్రెస్‌లో కొనసాగేందుకు ఉన్న రాజకీయ ఇబ్బందులు. ఇవన్నీ కలిపి చూస్తే కొండా దంపతుల తదుపరి అడుగు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి దారితీసే అవకాశం ఉంది.
ఉత్తరం కాకతీయ ఎడిటర్
కిరణ్ గౌడ్ అరెల్లి
-7396604266

