ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలి
అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులకు వినతి
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
పర్యాటక వీసాల ఇబ్బందులపై ప్రస్తావన
కాకతీయ, వరంగల్ బ్యూరో : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్ షాలను కలిశారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలను వారికి వివరించారు. అమెరికాలో 12 లక్షల మందికిపైగా తెలుగు ప్రజలు ఉండగా, వారిలో సుమారు 6 లక్షల మంది తెలంగాణకు చెందినవారని తెలిపారు. పర్యాటక వీసాల విషయంలో తెలంగాణ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అన్ని రకాల వీసా నిబంధనల్లో సడలింపులతోపాటు లక్ష డాలర్ల ఫీజు నిబంధనను తగ్గించే అంశాన్ని అమెరికా పార్లమెంటులో ప్రస్తావించాలని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

