సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం దారుణం
బీసీ మహిళా నేతపై రాజకీయ కక్ష సాధింపు తగదు
కుటుంబ సభ్యుల రాజకీయ అభిప్రాయాలకు మంత్రిని బాధ్యురాలిని చేస్తారా..?!
ఒకే కుటుంబంలో భిన్న రాజకీయ భావాలు ఉండకూడదా..?!
కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్‌కుమార్ డిమాండ్
కాకతీయ, గీసుగొండ: తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ప్రజల కోసం పోరాడుతూ, బీసీ వర్గాల గొంతుకగా నిలిచిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం దారుణమని జిల్లా నాయకులు రడం భరత్‌కుమార్ అన్నారు. గీసుగొండ మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. కుటుంబ సభ్యురాలు చేసిన వ్యక్తిగత రాజకీయ వ్యాఖ్యలకు మంత్రిని బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తన తల్లికి సంబంధం లేదని ఆమె స్వయంగా స్పష్టం చేసిన విషయాన్ని రడం భరత్‌కుమార్ గుర్తుచేశారు. కుటుంబ బంధం ఉన్నంత మాత్రాన ఒకరి వ్యాఖ్యలకు మరొకరిని రాజకీయంగా బాధ్యురాలిని చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు భిన్న రాజకీయ పార్టీలను, అభిప్రాయాలను అనుసరించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే వాటిపై మాట్లాడిన వ్యక్తినే ప్రశ్నించాలి తప్ప, సంబంధం లేని తల్లిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఏ న్యాయమని ప్రశ్నించారు. బీసీ మహిళా నేతగా కొండా సురేఖను కుటుంబ సభ్యురాలి వ్యాఖ్యలను కారణంగా చూపి పదవి నుంచి తప్పించడం బీసీ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. కొండా సురేఖపై చర్యకు కారణమైన ఆమె తప్పేమిటో స్పష్టంగా వెల్లడించాలని, కుమార్తె వ్యాఖ్యల ఆధారంగా మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఆమెను తిరిగి మంత్రి పదవిలో కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు పేర్ల శ్రావణ్, కొమ్ముల కమల బిక్షపతి, బానోతు రాఘవేంద్ర, నాయకులు దర్శనాల రాజు, తాళ్లపల్లి అనిల్, కార్తీక్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

