ప్రజలకు మిగిలింది మోసమే
కాంగ్రెస్ హామీలు గాలిలో కలిసాయి
వాగ్దానాలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ ఏమయ్యాయి?
మహిళలకు రూ.2,500.. వృద్ధులకు రూ.4,000 హామీలు ఎక్కడ?
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ధ్వజం
కాకతీయ, భూపాలపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలను మర్చిపోవడం ప్రజాస్వామ్య పాలన కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని, పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులను థియేటర్లో నిర్బంధించి బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, దానిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. బీఆర్ఎస్ ఎక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అక్కడ అధికార పార్టీ పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సరికాదని, పోటీగా సభలు పెట్టడం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పోటీ పడాలని సూచించారు.
నిరుద్యోగులు, విద్యార్థుల హామీలపై నిలదీత
జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం రాకపోతే నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గండ్ర గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్షిప్లను గత ప్రభుత్వాలు అమలు చేశాయని, ప్రస్తుత ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఆగస్టు 15లోగా ఫీజు బకాయిలు చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చినా గడువు దాటినా చెల్లింపులు జరగలేదన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలు టీసీలు ఇవ్వడం లేదని, బీఏ నుంచి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంసీఏ వరకు చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెన్షన్లు పెంచాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
భూ సమస్యలు, సింగరేణి కార్మికులపైనా విమర్శలు
భూభారతి పేరుతో తీసుకొచ్చిన మార్పులతో రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గండ్ర ఆరోపించారు. 22-ఏ నిబంధనను తక్షణమే రద్దు చేసి పేద రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించామని, ప్రస్తుతం మెడికల్ బోర్డుల ద్వారా అర్హులైన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూనే ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని గండ్ర విమర్శించారు. కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూపాలపల్లికి కొత్తగా ఏం చేశారని ప్రశ్నించారు. భూపాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయడం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, డిగ్రీ కళాశాల తీసుకురావడం, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించడం, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేసి ఉంటే స్వాగతిస్తానన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలుపై అంబేద్కర్ సెంటర్కు రావాలని, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని గండ్ర సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, రైతుల భూ సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

