జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడొద్దు
పేద విద్యార్థుల చదువుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కీలకం
మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ : విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి విద్యకు ఆటంకం కలిగించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పెండింగ్‌లో ఉంచడం సరికాదని మాజీ చీఫ్‌విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడొద్దని హెచ్చరించారు. హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సందర్భంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్మృతివనం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు విద్యార్థులు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన, ధర్నా చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, జీవో 97ను రద్దు చేయాలని నినదించారు.
చదువుకు ఆటంకం కలిగించొద్దు
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని వినయ్ భాస్కర్ అన్నారు. నిధులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల చదువులు, కళాశాలల్లో ప్రవేశాలు, పరీక్షలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. విద్యార్థుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి వారి విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, విద్యావేత్తలు, సంబంధిత వర్గాలతో చర్చించి వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్ విద్య సాంకేతిక విద్యలో కీలకమైన భాగమని, వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఈ విద్యపై ఆధారపడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే బీఆర్‌ఎస్ విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఓరుగల్లు గడ్డపై పోరుబాట చేపట్టాల్సి వచ్చిందని వినయ్ భాస్కర్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు జీవో 97ను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని, వారి సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమానికి వస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారు కార్యక్రమానికి సంఘీభావం తెలిపి ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, యువత హక్కుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

