1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి
ఏజెన్సీలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలి
షెడ్యూల్ ప్రాంత 29 శాఖల జీవోలను చట్టం చేయాలి
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్
కాకతీయ, ఏటూర్‌నాగారం రూరల్ : ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలని, షెడ్యూల్ ప్రాంతంలోని 29 శాఖల ప్రభుత్వ ఉత్తర్వులను చట్టబద్ధం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా. మైపతి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని, ఆదివాసీలపై అటవీశాఖ దాడులను నియంత్రించాలని, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో కంపెనీల పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆదివాసీల హక్కులు, భూములు, విద్య, ఉద్యోగాలు, రాజ్యాంగ రక్షణలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో సోమవారం ఏటూర్‌నాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 17 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మైపతి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఆదివాసీల భూములు, అటవీ హక్కులకు రక్షణ కల్పించాలి
రాష్ట్రంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పటిష్ఠంగా అమలు చేయాలని అరుణ్‌కుమార్ అన్నారు. భూహక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్టికల్ 244(1), ఆర్టికల్ 342, ఆర్టికల్ 19(ఈ), ఐటీడీఏ బైలాస్, పీసా చట్టం, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, చట్టవిరుద్ధ భూకబ్జాలు, బదలాయింపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో భూముల పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, గ్రామసభల అధికారాలను గౌరవిస్తూ పీసా చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని అన్నారు. అటవీశాఖ దాడులను నియంత్రించాలని, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో కంపెనీల పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రాజెక్టులు, ఇతర ఉపాధి అవకాశాల్లో స్థానిక ఆదివాసీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు.
విద్య, ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నత విద్యకు మరిన్ని అవకాశాలు కల్పించాలని అరుణ్‌కుమార్ కోరారు. వైద్య, ఇంజినీరింగ్, న్యాయ, బీఈడీ, పీజీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని అన్నారు. స్థానిక యువతకు విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా కారణంగా గోదావరి నది, భూగర్భ జలాలకు జరుగుతున్న నష్టాన్ని నియంత్రించాలని, 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులపై సుమోటోగా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ 17 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆదివాసీల హక్కులు, భూమి, విద్య, ఉద్యోగాలు, ఉపాధి, స్థానిక పరిపాలనకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, జాతీయ అధ్యక్షుడు కొట్నాక విజయ్, ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, జాతీయ ఉపాధ్యక్షుడు పోడెం బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పులుష బాలకృష్ణ, పడిగ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేఖ గణేష్, ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి కోరినబెల్లి గణేష్, రాష్ట్ర కార్యదర్శి సిద్ధబోయిన కార్తీక్, ఉపాధ్యక్షుడు కబ్బాక లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు దబ్బకట్ల శ్రీకాంత్, ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు వట్టం సుభద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కోటేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనం చంటి, డివిజన్ అధ్యక్షుడు పోవడం శోభన్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కుంజ నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి కుడిమేత సమ్మయ్య, భూపాలపల్లి అధ్యక్షుడు గొరిగ కిరణ్, భూపాలపల్లి ప్రధాన కార్యదర్శి మట్టి కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధారబోయిన రమేష్, స్థానిక నాయకుడు వంక నరేష్ తదితరులు పాల్గొన్నారు.

