నల్లచొక్కాలతో నిరసన చేస్తే పోలీసుల దాడులా?
మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో వ్యవహరించిన తీరు నీచం
పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షస పాలన సాగిస్తున్నారు
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఒరిగిందేమీ లేదు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాకతీయ, పాలకుర్తి : నల్లచొక్కాలతో నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేయడం అమానుషమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ నల్లచొక్కాలతో నిరసనకు వెళ్లినప్పుడు ఇదే నిబంధనలు, ఇదే తెలివి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మీకో న్యాయం.. మాకో న్యాయమా? అని నిలదీశారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఆయన సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషాదయాకర్‌రావు, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల దాడికి నిరసనగా రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా, మండల బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యుల గొంతు నులిమి, చీర లాగడం నీచమైన చర్య అని మండిపడ్డారు. శాసనసభలోనే పోలీసులు అమానుషంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్‌రెడ్డి రాక్షస రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా 6 గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎర్రబెల్లి విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పి ఎందుకు నెరవేర్చడం లేదో రేవంత్‌రెడ్డి ప్రజలకు, మహిళలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశారని విమర్శించారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించకుంటే కాంగ్రెస్ పని ఖతమవుతుందని హెచ్చరించారు.

కేసీఆర్ పాలనలోనే సంక్షేమానికి పెద్దపీట
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు, మహిళలు సంతోషంగా జీవించారని ఎర్రబెల్లి అన్నారు. ప్రజలు అడగకముందే కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు. వృద్ధుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచి, ఒంటరి మహిళలకు రూ.2 వేల పెన్షన్ అందించారని అన్నారు. వికలాంగులకు రూ.4 వేల పెన్షన్ అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పీడ విరగడ కావడానికి మరో 2 ఏళ్ల సమయం మాత్రమే ఉందని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఎర్రబెల్లి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసింది, చేసేది కూడా కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.

