అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు
పదేళ్ల పాలనలో ములుగు జిల్లాలో అభివృద్ధి శూన్యం
కాంగ్రెస్ హయాంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంటా కృష్ణారెడ్డి విమర్శ
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ములుగు జిల్లాకు జరిగిన అభివృద్ధి శూన్యమని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంటా కృష్ణారెడ్డి విమర్శించారు. జిల్లా ఏర్పాటు చేశామని చెప్పుకోవడం తప్ప ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభివృద్ధితో బీఆర్‌ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భయంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత, ప్రస్తుత పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ములుగు జిల్లా ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెబుతారని గంటా కృష్ణారెడ్డి అన్నారు.

