కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ వినతి
420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్
పారిశుధ్య పనులు చేపట్టి కాలనీల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
బీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ 66 డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ, రైతులకు రైతుభరోసా, పంటలకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు కూలీలకు ఏటా రూ.12,000, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు భృతి, జాబ్ క్యాలెండర్, విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు రూ.4,000 పెన్షన్, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12,000 అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, మురికి కంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పారిశుధ్య పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ను కోరారు. హామీల అమలుపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, వాటిని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆవాల రాధికా రెడ్డి, మునిగాల సరోజన, రాజశేఖర్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

