విద్య వ్యవస్థను రేవంత్ దెబ్బతీస్తున్నాడు
మొన్న ఇంటర్ రద్దు అన్నాడు..
ఇప్పుడు పాలిటెక్నిక్‌ను ప్రమాదంలోకి నెట్టాడు
రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
నెలనెలా బకాయిలు చెల్లిస్తామని సభలో మాట ఇచ్చి సీఎం తప్పారు
పేద విద్యార్థులు, ఆడబిడ్డలను చదువుకు దూరం చేయొద్దు
గ్రేటర్ వరంగల్ నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తాం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కాకతీయ, హన్మకొండ : విద్యా వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.13 వేల కోట్లకు పైగా పేరుకుపోయినా పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు టైంబాండ్ నిర్దేశించుకొని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలను ఆగం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ హన్మకొండలో కవిత ఫీజు పోరు యాత్ర చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి సుమారు 3 కి.మీ. దూరంలోని హన్మకొండ కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నడిఎండను సైతం లెక్కచేయకుండా 45 నిమిషాల పాటు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.
సభలో ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలి
తాను శాసనమండలి సభ్యురాలిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని సభలో లేవనెత్తానని కవిత గుర్తుచేశారు. నెలనెలా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సభలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పారని మండిపడ్డారు. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చిన్నచిన్న కళాశాలలు మూతపడుతున్నాయని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. మొన్న ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారని, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యను ప్రమాదంలోకి నెడుతున్నారని రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని అన్నారు. ఫీజులు చెల్లించే స్థోమత లేక పేద తల్లిదండ్రులు ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఆడపిల్లలే ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను విద్యకు దూరం చేయవద్దని కోరారు.
కలెక్టర్‌కు విద్యార్థుల సమస్యలు వివరించా
కలెక్టరేట్ వద్ద విద్యార్థులతో కలిసి కవిత అరగంటకు పైగా బైఠాయించారు. తమను, విద్యార్థులను కలెక్టరేట్‌లోకి అనుమతించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పోలీసులు అనుమతించడంతో హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కోర్సులు పూర్తయినా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజావాణిలోనూ ఇదే సమస్యపై విద్యార్థులు వస్తున్నారని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఈ సందర్భంగా తెలిపారు. సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నామని చెప్పారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని కవిత కోరారు.
వరంగల్ నుంచే పార్టీ జైత్రయాత్ర
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో అన్ని డివిజన్ల నుంచి టీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత తెలిపారు. ఇక్కడి నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తామని అన్నారు. హన్మకొండ జిల్లా తరాలపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ప్రజలకు మంచి చేయాలన్న గట్టి సంకల్పంతో కొత్త పార్టీ పెట్టానని చెప్పారు. మెరుగైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించడమే తన లక్ష్యమన్నారు. సామాజిక న్యాయంతోపాటు ప్రజలకు మంచి జరగాలన్న తమ సంకల్పానికి ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. పార్టీ నాయకులు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండి వారి తరఫున పోరాడాలని సూచించారు. అయోధ్యపురం రైతుల పరిస్థితి వనవాసానికి వెళ్లినట్లుగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అయోధ్యపురంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఆమెకు నిర్వాసితులు పరిహారంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దేవాదాయ శాఖ భూములతో తమ భూములు కలిసి ఉండటంతో గతంలో డీజిల్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసినప్పుడు 90 శాతం పరిహారం తమకు, 10 శాతం దేవాదాయ శాఖకు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఎకరాకు రూ.33 లక్షల పరిహారం ఇస్తున్నా తమకు రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని దేవాదాయ శాఖకు ఇస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరిగేలా పోరాడతానని కవిత హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని లాతూర్ కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన వారికి 734 ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. అదే విధంగా ఇక్కడ కూడా బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చేస్తామని, కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేలోపు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రితోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖ రాస్తానని తెలిపారు. తరాలపల్లిలో పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన పూజల్లో కవిత పాల్గొని అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీ వద్ద మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా స్పందించారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టి నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించడం దుర్మార్గమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలకే భద్రత లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలపై హింస, దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడులకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

