కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?
1000 రోజుల పాలనలో హామీల అమలు ఎక్కడ?
రైతు నుంచి యువత వరకు.. ప్రతి వర్గానికీ కాంగ్రెస్ బాకీ
ఇంటింటికీ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో బీఆర్ఎస్ ఉద్యమం
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధ్వజం
కాకతీయ, వర్ధన్నపేట/ పర్వతగిరి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారెంటీలు, 420 హామీలు, హామీ పత్రాలు, అఫిడవిట్ల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. దాదాపు 1000 రోజుల పాలన పూర్తవుతున్నా హామీలను అమలు చేయకుండా బాకీలుగా మార్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన వారం రోజుల పోరుబాటలో భాగంగా సోమవారం పర్వతగిరి మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరం నుంచి ర్యాలీగా వెళ్లి ఎంపీడీవోకు 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు సంబంధించిన వినతిపత్రాన్ని అరూరి రమేష్ అందజేశారు.
రైతుల హామీలన్నీ బాకీలుగానే మిగిలాయి
ఎకరానికి రూ.10 వేలుగా ఉన్న రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అరూరి రమేష్ అన్నారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌లో స్పష్టంగా ప్రకటించినా అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చెప్పిన స్థాయిలో చేయలేదని, రైతు బీమా కింద రూ.5 లక్షల రక్షణ కల్పిస్తామని చెప్పి ప్రీమియం చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం, పంటలకు పంట బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు గతంలో ఎకరానికి రూ.10 వేల వరకు ఇన్పుట్ సబ్సిడీ అందించామని గుర్తుచేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదని అన్నారు.

మహిళలు, విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలేవీ?
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని అరూరి రమేష్ విమర్శించారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి తులం బంగారం ఇవ్వలేదని, గత ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని అన్నారు. గతంలో ఉన్న రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి అమలు చేయలేదని, కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, స్కూటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.
ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది
ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్న ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడం సరికాదని అరూరి రమేష్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసులకు భయపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి సమాధానం చెబుతామని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌గౌడ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఏకాంతం గౌడ్, యుగేందర్‌రావు, చీమల బిక్షపతి, మాజీ ఎంపీటీసీ రాజు, మండల సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

