దళితుల హక్కులను హరించవద్దు
తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్
కాకతీయ, హన్మకొండ : ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హౌస్ అరెస్ట్‌ల పేరుతో అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. తనను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. పార్టీ కఠిన చర్యలు తీసుకున్నప్పుడే దళిత సమాజంలో బీఆర్ఎస్‌పై నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను హరించే ప్రయత్నాలను సహించబోమని రామకృష్ణ స్పష్టం చేశారు. దళితులు, పేదలు, అణగారిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున నిలబడి పోరాడుతామని తెలిపారు.

