జై శ్రీరామ్ బస్తాల్లో పీడీఎస్ బియ్యం రీప్యాకింగ్
హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
ఇద్దరు అరెస్టు.. రూ.2.07 లక్షల విలువైన బియ్యం, యంత్రాలు పట్టివేత
టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో అక్రమ రీప్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి
కాకతీయ, వరంగల్ బ్యూరో : పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, జై శ్రీరామ్ తదితర కమర్షియల్ రైస్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్‌పై దాడి చేసి 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రైస్‌మిల్‌పై దాడి చేసిన పోలీసులు 50 కిలోల చొప్పున 64 బస్తాలు, 25 కిలోల చొప్పున 106 బస్తాలను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.1.96 లక్షలుగా అంచనా వేశారు. హసన్‌పర్తి పరిసర ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి కమర్షియల్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. రీప్యాకింగ్ కోసం వినియోగిస్తున్న రూ.6 వేల విలువైన వెయింగ్ మెషిన్, రూ.5 వేల విలువైన రైస్ బ్యాగ్ స్టిచింగ్ మెషిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బియ్యం, యంత్రాలతో కలిపి మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.2.07 లక్షలుగా పేర్కొన్నారు. ఈ కేసులో హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన కాశబోయిన మొగిలి (50), కమలాపూర్‌కు చెందిన బెజ్జంకి శ్రీనివాస్ (56)ను అరెస్టు చేశారు. నిందితులు, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, రవాణా చేయడం, నిల్వ చేయడం, రీప్యాకింగ్ చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఎస్ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

