యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై అదనపు భారం పడుతోంది
డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేక రాయితీ విధానం అమలు చేయాలి
బ్యాంకులు, చెల్లింపు సంస్థలతో ప్రభుత్వం సమన్వయం చేయాలి
రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు
కాకతీయ,వరంగల్ : ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీల చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సకాలంలో అందించడంలో డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు లావాదేవీ వ్యయం పడుతోందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించేలా యూపీఐ చెల్లింపులపై డీలర్లకు ప్రత్యేక మినహాయింపు లేదా రాయితీ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సంస్థలతో సమన్వయం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందడంతో పాటు డీలర్లపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాగుర్ల వెంకటేశ్వర్లు కోరారు.

