ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్
పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జె. చోంగ్తు ఆదేశం
కాకతీయ, వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జె. చోంగ్తు, ఐఏఎస్ సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఆమె ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, నిన్న పెచ్చులు ఊడిన ఆరోగ్యశ్రీ వార్డును పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భవనం స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల భద్రత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్అండ్బీ ఈఈ నరేందర్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఈఈ ప్రసాద్‌లను ఆదేశించారు. పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. అనంతరం వివిధ విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ హాజరు వివరాలను పరిశీలించిన ఆమె సమయపాలనతో విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, మందుల లభ్యత, పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పర్యటనలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డా. వాణి, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రామ్‌కుమార్‌రెడ్డి, వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

