వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం
విద్యార్థుల నుంచి రూ.10 వేల వసూళ్ల ఆరోపణ
డీఎంఈకి 10 పేజీల ఫిర్యాదు చేసిన విద్యార్థులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సీరియస్ అయిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కు వివరణ కోరుతూ ఆదేశాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) పరిధిలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెను కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, అలాగే పాసై వెళ్లిపోయిన విద్యార్థుల వద్ద నుండి కొందరు టీచర్లు రూ.10 వేల చొప్పున వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ కారణంతో ఈ డబ్బులు వసూలు చేస్తున్నారనేది అంతుచిక్కకుండా ఉంది.
10 పేజీల ఫిర్యాదుతో డీఎంఈకి లేఖ
ఈ అక్రమ వసూళ్లను భరించలేక విద్యార్థులు సాహసించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) కి మెయిల్ ద్వారా ఏకంగా 10 పేజీలతో వివరణాత్మక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టీచర్ల వేధింపులు, డబ్బుల వసూళ్లపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఫిర్యాదుపై వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ గా స్పందించింది. వెంటనే ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేసింది. వసూళ్ల ఆరోపణలపై వివరణ కోరగా, విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం నిజమేనని నర్సింగ్ ప్రిన్సిపాల్ అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవ వివరాలు వెల్లడిస్తానని ప్రిన్సిపాల్ తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కళాశాల వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

