ఎంజీఎంలో ఉద్రిక్తత
ఆస్పత్రిలోకి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే దాస్యంను అడ్డుకున్నపోలీసులు
భవనాలకు పెచ్చులూడటాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
అనుమతి లేదంటూ ఎంజీఎం ప్రాంగణంలోనే నిలిపిన పోలీసులు
రోగులను పరామర్శించేందుకు వెళ్లనివ్వాలని కోరిన మాజీ ఎమ్మెల్యే
నిరాకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట
పెనుగులాట, తొక్కిసలాటలో వినయ్‌భాస్కర్ కాలు, చేతికి తీవ్ర గాయాలు..రక్తస్రావం
నాకు ఎంజీఎంలోనే చికిత్స చేయాలంటూ పట్టు
గంటపాటు ఎంజీఎం ఎదుట కొనసాగిన హైటెన్షన్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతల ఆందోళన..!
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, మౌలిక వసతుల కొరత, రోగుల ఇబ్బందులను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వినయ్‌భాస్కర్ కాలు, చేతికి గాయాలై రక్తస్రావం జరిగినట్లు ఆయన వర్గాలు తెలిపాయి. రోగులను పరామర్శించేందుకు అనుమతించాలని ఆయన కోరినా పోలీసులు నిరాకరించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రధాన గేటు వద్ద గంటపాటు హైటెన్షన్ నెలకొంది.
ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు సహా పలువురు గాయపడిన ఘటన కలకలం రేపింది. దీంతో ఆస్పత్రి భవనాల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎంజీఎంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, భవనాలకు పెచ్చులు ఊడిపడుతున్న తీరును పరిశీలించేందుకు వినయ్‌భాస్కర్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆస్పత్రికి వచ్చారు.
గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు
వినయ్‌భాస్కర్ ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. రోగులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన తనను ఎందుకు అడ్డుకుంటున్నారని వినయ్‌భాస్కర్ ప్రశ్నించినట్లు ఆయన వర్గాలు తెలిపాయి. అనుమతిపై స్పష్టత రాకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గేటు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం అనంతరం తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో పెనుగులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వినయ్‌భాస్కర్ కాలు, చేతికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనట్లు ఆయన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులపై వినయ్‌భాస్కర్ ఆగ్రహం
తనపై పోలీసులు దాడి చేశారని వినయ్‌భాస్కర్ ఆరోపించారు. తోపులాటలో గాయపడటంతోపాటు కడుపులో తన్నారని, చేతికి గాయమైందని కన్నీటి పర్యంతమైనట్లు ఆయన వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తనను ప్రభుత్వ ఆస్పత్రి ఎంజీఎంలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తనకు ఎంజీఎంలోనే చికిత్స అందించాలని, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లవద్దని వినయ్‌భాస్కర్ పట్టుబట్టినట్లు తెలిపారు. ఎంజీఎంలో పేద ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందడం లేదని వినయ్‌భాస్కర్ విమర్శించారు. రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడం, భవనాల పైకప్పులు పెచ్చులూడిపడటం, అంబులెన్స్‌ల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటన మరవకముందే మరో వార్డులోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోగులకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలోనే వారి భద్రతకు భరోసా లేకపోవడం దారుణమన్నారు.
మహిళల నిలదీత.. గంటపాటు హైటెన్షన్
వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై అక్కడున్న కొందరు మహిళలు కూడా పోలీసులను ప్రశ్నించినట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ఎంజీఎంలో కనీస వసతులు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వినయ్‌భాస్కర్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని వారు నిలదీసినట్లు పేర్కొన్నారు. రోగులకు సరైన వైద్యం, కనీస సౌకర్యాలు కల్పించాలని మహిళలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధి రోగుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకోవడం సరికాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలను పోలీసులతో అడ్డుకోవడం తగదని వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

