సాయి వర్షిణికి సీపీ శ్వేత అభినందనలు
సాఫ్ట్బాల్ అండర్-15 ఆసియా కప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం
కాకతీయ, హనుమకొండ : భారత సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపికైన హనుమకొండకు చెందిన క్రీడాకారిణి వెల్పుల సాయి వర్షిణిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పిల్లి సాంబశివరావు ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ పోలేపాక వినయ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీని కలిశారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ భారత జట్టుకు సాయి వర్షిణి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారిణిగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమన్నారు. హనుమకొండకు చెందిన అనిల్, సుజాత దంపతుల కుమార్తె సాయి వర్షిణి గ్రీన్వుడ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. చైనాలోని వుక్సీ నగరంలో అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరగనున్న 5వ అండర్-15 ఉమెన్స్ సాఫ్ట్బాల్ ఆసియా కప్-2026లో సాయి వర్షిణి పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాయి వర్షిణి తండ్రి అనిల్, అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ పాల్గొన్నారు.

