పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్ ప్రత్యేక గుర్తింపు
కాకతీయ, శంకరపట్నం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారాలు ఆయన కలలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన రౌతు రాజమణి–మల్లయ్య దంపతుల ఏకైక కుమారుడు రౌతు కిరణ్‌కుమార్ 2012లో మిమిక్రీ కళాకారుడిగా ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేయగా, 2014లో గుండెపోటుతో మృతి చెందారు. తల్లి రాజమణి ప్రోత్సాహంతో కిరణ్‌కుమార్ ముందుకు సాగారు. ప్రత్యేక శిక్షణ లేకుండానే సాధన చేసి 70కిపైగా నటులు, రాజకీయ నాయకుల గొంతులతో పాటు జంతువులు, యంత్రాల శబ్దాలను అనుకరించే స్థాయికి ఎదిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేలాది వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా రవీంద్రభారతి, త్యాగరాయ గానసభలో రెండుసార్లు సన్మానాలు, అవార్డులు అందుకున్నారు. పలువురు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ల చేతుల మీదుగా సత్కారాలు పొందారు. కళాకారులు, అభిమానులు ఆయనను డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రియ శిష్యుడిగా పిలుస్తారు. 2013లో పావనిని వివాహం చేసుకున్న ఆయనకు కృష్ణ కార్తీక్, లహ శ్రీ ఇద్దరు పిల్లలు.

